HOME

వాట్సాప్‌ వెరిఫికేషన్‌ పేరుతో ఫోన్‌..

 వాట్సాప్‌ వెరిఫికేషన్‌ పేరుతో ఫోన్‌..


ఇక్కడ డీ యాక్టివేట్‌.. అక్కడ యాక్టివేట్


ఒక్కరిది హ్యాక్‌ ఐతే.. కాంటాక్టులన్నీ హ్యాకర్ల చేతికి


లింకులు కొందరికి.. డబ్బులు అవసరమని ఇంకొందరికి మెస్సేజ్‌లు


నయా పంథాలో హ్యాకింగ్‌కు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు


వీఐపీల నంబర్లు దొరికితే పండుగే
టోలిచౌకి వారినుంచి రూ.3లక్షలు స్వాహా


నైజీరియన్‌ నేరగాళ్ల పనే అంటున్న సైబర్‌ పోలీసులు
రెండంచెల ధ్రువీకరణతో భద్రత


హ్యాకింగ్‌ జరుగుతుందిలా..




సాధారణంగా ఎవరైనా వాట్సాప్‌ను తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోగానే, ఏ ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ కనెక్ట్‌ చేయాలని అడుగుతుంది. వెంటనే ఫోన్‌ నంబర్‌ ఇవ్వగానే, ఆ నంబర్‌కు వాట్సాప్‌ సంస్థ నుంచి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేయగానే సెల్‌ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఆ సెల్‌ఫోన్‌కు ఉండే బ్యాకప్‌ కూడా వచ్చేస్తుంది.


సైబర్‌నేరగాళ్లు కూడా తమ సెల్‌ఫోన్‌లో వాట్సాప్‌ డౌన్‌లోడ్‌ చేసి, అందులో ఒక ఫోన్‌ నంబర్‌ ఇస్తున్నారు. అందులో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి తాము వాట్సాప్‌ వెరిఫికేషన్‌ చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలు విని ఎవరైనా తమ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పారంటే, వెంటనే ఓటీపీ చెప్పిన వారి ఫోన్‌లో ఉండే వాట్సాప్‌ డీ యాక్టివేట్‌ అయిపోయి, ఓటీపీ తీసుకున్న సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ అవుతుంది.


సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో వాట్సాప్‌ యాక్టివేట్‌ కాగానే, ఓటీపీ చెప్పిన వ్యక్తికి సంబంధించిన ఫోన్‌లో ఉండే వాట్సాప్‌ నంబర్లు అన్ని సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో కన్పిస్తాయి. ఆ ఫోన్‌ నంబర్లో ఎంత మంది వీఐపీలున్నారని పరిశీలిస్తారు.


అందులో ఉండే ఫోన్‌ నంబర్లతో సైబర్‌నేరగాళ్లు మైండ్‌గేమ్‌ అడటం ప్రారంభిస్తారు.




అందులో ఉండే వాట్సాప్‌ నంబర్లలో కొందరికి ఒక లింక్‌ పంపిస్తారు. మరికొందరికి డబ్బులు అత్యవసరమంటూ మేసేజ్‌లు పెడుతుంటారు.


లింక్‌లు రీసివ్‌ చేసుకున్న వ్యక్తులు, ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే సైబర్‌నేరగాళ్ల ఫోన్‌లో క్లిక్‌ చేసిన నంబర్‌ వాట్సాప్‌ యాక్టివేట్‌ అవుతుంది.


ఇలా యాక్టివేట్‌ కాగానే మరోసారి అందులో ఉండే నంబర్లకు డబ్బులు అవసరమున్నాయని, మరికొందరికి లింక్‌లు పంపిస్తూ డబ్బులు లాగుతుంటారు.




మొదట ఓటీపీ చెప్పిన వ్యక్తికి సంబంధించిన ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ ధ్రువీకరణ అంశాలను కూడా సైబర్‌నేరగాళ్లు మార్చేస్తున్నారు. హ్యాకర్‌ ఆ నంబర్‌ను వాడకుండా, మరో నంబర్‌ను తన వాట్సాప్‌కు యాక్టివేట్‌ చేసుకున్నా ధ్రువీకరణ అంశాలు మారడంతో అసలు ఫోన్‌ నంబర్‌ యజమాని దానిని వాట్సాప్‌కు ఉపయోగించుకోలేడు.


మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఓటీపీ చెప్పినా, చైన్‌ సిస్టమ్‌ మాదిరిగా ఆ నంబర్‌తో సంబంధమున్న వారి వివరాలు సైబర్‌నేరగాళ్ల చేతికి వెళ్తుంటాయి.


మూడు ఘటనలు.. నాలుగు లక్షలు




వాట్సాప్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌నేరగాళ్లు తమ తల్లికి ఆరోగ్యం బాగలేదంటూ మేసేజ్‌లు పంపించారు. సహాయం చేసే వాళ్లు పలాన ఖాతాకు డబ్బులు డిపాజిట్‌ చేయాలని కోరారు. ఆ మేసేజ్‌లు చూసిన టోలిచౌకికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడని రూ.3 లక్షలు వేర్వేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశారు. మరుసటి రోజు ఫోన్‌ చేసి మీ అమ్మకు ఎలా ఉందని అడిగారు. ఫోన్‌ రీసివ్‌ చేసుకున్న వ్యక్తి అశ్చర్యపోయాడు. అదంతా మోసమని చెప్పడంతో బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో లక్ష రూపాయలు సైబర్‌నేరగాళ్లు కాజేశారు. ఇదిలా ఉండగా వీఎస్‌టీ కంపెనీ ఎండీ పేరుతో తనకు అత్యవసరంగా డబ్బులు కావాలంటూ అందులో పనిచేసే ఉద్యోగులకు సమాచారం వెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది విషయాన్ని తమ ఎండీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


రెండంచెల ధ్రువీకరణతో భద్రత

వాట్సాప్‌లో రెండంచెల ధ్రువీకరణ పెట్టుకోవడం సురక్షితం. సైబర్‌నేరగాళ్లు ముందుగా ఎవరో ఒకరు అమాయకుల నంబర్‌ను యాక్టివేట్‌ చేసుకొని, వాళ్ల ఓటీపీతో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేస్తారు. ఇలా అందులోని ఫోన్‌ నంబర్లతో, మరిన్ని కాంటాక్టులకు లింక్‌లు పంపి వాట్సాప్‌లను యాక్టివేట్‌ చేస్తుంటారు. వీఐపీల పేరు, వారి డీపీలతో డబ్బులు కావాలని ఇతరాత్ర పనుల కోసం మేసేజ్‌ పంపిస్తుంటారు. కొందరు నిజమని నమ్మి డబ్బు వేస్తుంటారు. అయితే హ్యాక్‌ అయిన వాట్సాప్‌లలో విలువైన సమాచారం ఉంటే దాని వల్ల కూడా బాధితులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వాట్సాప్‌ సెట్టింగ్‌లో, అకౌంట్‌ అని ఉంటుంది. అందులో డబుల్‌ వెరిఫికేషన్‌ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్డ్‌ చేసుకుంటే, వాట్సాప్‌ను నేరగాళ్ల్లకు హ్యాకింగ్‌ చేయడం సాధ్యం కాదు. – కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి