HOME

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది.

 2022 జనవరి ఒకటి అర్హతా తేదీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 


కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. 2022 జనవరి ఒకటి అర్హతా తేదీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి సవరణ ముందస్తు కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా పునరావృతమైన పేర్లను తొలగిస్తారు. తప్పులను సరిచేస్తారు. నవంబర్ ఒకటో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,03,56,854 మంది ఓటర్లున్నారు. అర్హులైన ఓటర్లతో కూడిన జాబితాను 2022 జనవరి ఐదో తేదీన ప్రకటిస్తారు.


ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు...




2022 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్​లైన్​లో www.nvsp.in లేదా www.votersportal.eci.gov.in లలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదా ఓటర్స్ పోర్టల్ యాప్ డౌన్​లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా మీ ఓటరు కార్డు కోసం ఓటు ఎన్​రోల్ చేసుకోవచ్చు. అర్హత ఉండి ఓటుహక్కు లేని వారు, ఓటు హక్కును మరో చోటుకు మార్చుకోవాలనుకున్న వారు, వివరాల్లో మార్పులు చేసుకోవాలనుకున్న వారందరూ ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.



విస్తృత కార్యక్రమాలు..




అర్హులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే దిశగా చైతన్యపరిచేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. గణనీయంగా ఉన్న యవతకు ఓటు హక్కు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే సిబ్బంది కళాశాలలు, సంస్థలకు వెళ్లే వారని... ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈఓ కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకునేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


జాబితాలో పేరు తొలగించేలా చూస్కోండి..




ఎవరైనా మరణించి ఉంటే కుటుంబ సభ్యులు వారి వివరాలను స్వచ్ఛందంగా ఇచ్చి జాబితాలో పేరు తొలగించేలా చూడాలని శశాంక్ గోయల్ కోరారు. కొత్తగా ఓటుహక్కుతో పాటు మార్పులు, చేర్పుల కోసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ నెలాఖరు వరకు గడువునిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి