ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం.
👉 మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో.
👉 కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo.
మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..!
ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి. ఏ పార్టీ మెనిఫెస్టో చూసినా ఉచితాలే దర్శనమిస్తాయి.
ఇక తమిళనాడులో అయితే లెక్కే లేదు.
ఉచిత టీవీ,ఉచిత ఏసీ,ఉచిత సైకిల్,ఉచిత బైక్, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం,ఉచిత కేబుల్ కనెక్షన్.. ఇలా ఒక్కటా రెండా.. అక్కడ అన్నీ ఉచితాలే.
ఈ ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉచిత పథకాలతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారని..
ఏ పనీ చేయకుండా తయారు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ప్రకటించిన ఉచిత హామీలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.
ఉద్యోగాలు,మౌలిక సదుపాయాల కల్పన, విద్యా వైద్యారంగ అభివృద్ధి,రవాణా, వ్యవసాయ రంగాలను పక్కనబెట్టి.. ఉచిత హామీలపైనే అభ్యర్థులు ఫోకస్ పెడుతున్నారని పిటిషన్ వాదించారు. వీటికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దానిపై విచారించిన జస్టిన్ ఎన్.కిరుబకరన్, జస్టిస్ బి.పుగలెంతి నేతృత్వంలోని ధర్మాసనం. ఉచిత పథకాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఉచిత పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులుగా మారుతున్నారని అభిప్రాయపడింది.
ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు తక్కువలో తక్కువ రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నారని, బిర్యానీ,బీరు కోసం ఓటువేస్తే,మీ నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడుంటుందని ప్రశ్నించింది.ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకుందని స్పష్టం చేసింది.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉచిత కలర్ టీవీలు,ఫ్యాన్స్,మిక్సర్ గ్రైండర్లు,ల్యాప్‌టాప్‌లు.. వంటి హామీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఉచిత వాషింగ్ మెషీన్ హామీ కూడా ఇచ్చింది.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మహిళలకు రేషన్ కోసం ఆర్థిక సాయం చేస్తాయని కూడా ప్రకటించాయి. ఐతే ఈ ఉచిత హామీల సంప్రదాయం కొనసాగడం ప్రజలకు ఎంత మాత్రమూ మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోనని సెటైర్లు వేసింది.
ఉచిత హామీలను అవినీతి వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉందని.వీటి వలన ఓటర్లు ప్రభావితమవుతున్నారని అభిప్రాయపడింది. ఉచిత పథకాల వలన తమిళ ప్రజలు బద్ధకస్తులుగా మారిపోయారని..
అందుకే హోటళ్లు, సెలూన్‌లు,చివరకు పొలాల్లో పనిచేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మద్రాస్ హైకోర్టు కోర్టు తెలిపింది. రానున్న రోజుల్లో ఇక్కడి స్థిర, చరాస్తులకు వలస కార్మికులే యజమానులుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఉచిత పథకాలకు సంబంధించి పిటిషనర్ పేర్కొన్న 20 ప్రశ్నలకు కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఉచిత హామీలకు అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడతారో ఏప్రిల్ 26 లోగా చెప్పాలని స్పష్టం చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి