HOME

నస్పూర్‌ చెరువు చుట్టూ భూ దందా

నస్పూర్‌ చెరువు చుట్టూ భూ దందా...

_నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు...


_సందర్శించిన అదనపు కలెక్టర్‌..._ 


_మున్సిపల్‌ అధికారిపై అట్రాసిటీ కేసు...
_






నస్పూర్‌, ఏప్రిల్‌  23 : నస్పూర్‌ చెరువు చుట్టూ మూడు వైపుల భూ దందా జోరుగా సాగుతోంది. కొందరు యథేచ్ఛగా ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో రియల్‌ వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.   చెరువు సర్వే నంబరు 126లో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. చెరువు మూడు వైపుల నుంచి రియల్‌ వ్యాపారులు పట్టా భూమి పేరిట చొచ్చుకు రావడంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోతోంది. దీనికి తోడు నీటి సామర ్థ్యం తగ్గడంతో చెరువుపై ఆధారపడిన రైతులు, మత్య్సకారులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.  చిన్ననీటి వనరులను ధ్వంసం చేస్తే భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చెరువును కబ్జా కోరల్లోంచి కాపాడాల్సినవసరం ఎంతైనా ఉంది. 



 _నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు...



నస్పూర్‌ చెరువు ఆనుకొని ఒక వెంచర్‌ అనుమతి పొందగా మిగిలిన వెంచర్లు అనుమతులు లేకుండానే ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారు. చెరువు శిఖం హద్దు నుంచి 30 మీటర్ల బఫర్‌ జోన్‌ వదిలి నిర్మాణాలు చేయాల్సి ఉండగా ఏకంగా ప్లాట్లనే ఏర్పాటు చేశారు. కొన్ని వెంచర్లలో శిఖం భూమిలోకి రియల్‌ వ్యాపారులు చొచ్చుకు వచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కబ్జాలను గుర్తించి చర్యలు చేపట్టాల్సినవసరం ఎంత్తైన ఉంది.  


 _సందర్శించిన అదనపు కలెక్టర్‌..._ 



నస్పూర్‌ చెరువును శనివారం అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తోపాటు రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు సందర్శించారు. నస్పూర్‌ సమీపంలో ఇటీవల వెంచర్‌ హద్దురాళ్ళను తొలగించిన సమయంలో జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. చెరువు చుట్టూ ఉన్న కొన్ని వెంచర్లను పరిశీలించి వివరాలను సేకరించారు. వెంచర్లు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని యజమానులకు సూచించారు. ఆర్‌డీవో వేణు, తహసీల్దార్‌ జ్యోతి, మున్సిపల్‌ కమిషనర్‌ తుంగపిండి రాజలింగు, టీపీఎస్‌ యశ్వంత్‌ కుమార్‌, సర్వేయర్‌ సాయిక్రిష్ణ, నీటి పారుదల శాఖ అధికారి గౌతమ్‌ పాల్గొన్నారు.  



 _మున్సిపల్‌ అధికారిపై అట్రాసిటీ కేసు..._ 



నస్పూర్‌ మున్సిపాలిటీ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉండడంతో ఇక్కడి భూములకు భారీగా ధరలు పలుకుతున్నాయి. అత్యధికంగా ప్రభుత్వం, అసైన్డ్‌ భూములు ఉండడంతో అందరి చూపు ఇక్కడే పడుతోంది. అక్రమ వెంచర్లు, కబ్జా భూముల వద్దకు వెళ్లాలంటే అధికారులు భయందోళనలు చెందుతున్నారు. అధికారులను, సిబ్బందిని బెదిరించిన సంఘటనలు ఇటీవల రెండు చోటుచేసుకున్నాయి.  గత నెల 25న మున్సినల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు నస్పూర్‌ చెరువు సమీపంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్‌లో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి యశ్వంత్‌ కుమార్‌ సిబ్బందితో హద్దురాళ్ళను తొలగించడానికి వెళ్లారు. దీంతో సదరు వెంచర్‌ యాజమాని అడ్డుకున్నాడని, విధులకు ఆటంకం కలిగించాడని టీపీఎస్‌ పోలీసులకు ఈనెల 4న ఫిర్యాదు చేయడంతో వెంచర్‌ యజమానిపై కేసు నమోదు చేశారు. టీపీఎస్‌ కులం పేరుతో దూషించాడని వెంచర్‌ యజమాని 5న ఫిర్యాదు చేయగా టీపీఎస్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదైంది. పరస్పర ఫిర్యాదులతో మున్సిపల్‌ అధికారిపై, వెంచర్‌ యజమానిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 12న తీగల్‌పహాడ్‌ శివారులో భూమి కొలతలకు వెళ్ళిన మండల సర్వేయర్‌ సాయిక్రిష్ణపై దాడి చేయగా ఇద్దరిపై కేసు నమోదైంది. సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు, లేదా న్యాయపరంగా పరిష్కరించుకోవాలి కాని కేసులు పెట్టడంపై అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎస్సై శ్రీనివాస్‌ను సంప్రందించగా మున్సిపల్‌ టీపీఎస్‌, వెంచర్‌ యజమాని పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో కేసులు నమోదు చేశామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి