ఇడ్లిలో జర్రి ప్రత్యక్షం !
హోటళ్లలో తిండి తినాలంటే జనాలు జంకుతున్నారు. ఇప్పటికే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆహార పదార్థాల్లో బల్లులు, జెర్రీలు వస్తుండటం ఇప్పుడు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ హోటల్‌లో పప్పులో జెర్రీ కనిపించగా.. ఇప్పుడు జగిత్యాలలోని ఓ పేరు మోసిన టిఫిన్ సెంటర్‌లోనూ ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఫిన్స్‌కు ఫేమస్ అయిన.. ఓ హోటల్‌కు ఆదివారం (అక్టోబర్ 13న) రోజున ఓ కస్టమర్ తన కుటుంబంతో సహా వచ్చాడు. తన రెండేళ్ల కొడుకుకు తినిపించేందుకు ఇడ్లీ వడ ఆర్డర్ చేశాడు. వాళ్లు ఇచ్చిన పార్సిల్ తీసి.. పిల్లాడికి తినిపిస్తున్న క్రమంలో.. అందులో జెర్రీ అవశేషాలు కనిపించాయి. అది చూసి.. షాక్ అయిన ఆ కుటుంబం వెంటనే.. హోటల్ యజమానిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. మిగతా కస్టమర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. అది జెర్రీ కాదని.. పేపర్ అని కాసేపు, దారం అని మరికాసేపు బుకాయించాడు. నోట్లో వేసుకుని తినిచూపించాలని కూడా ప్రయత్నించాడు. కానీ.. అది జెర్రీ అని తేలటంతో వెంటనే ఉమ్మేశాడు. దీంతో.. ఆ ఇడ్లీలను చెత్తడబ్బాలో పడేయటానికి ప్రయత్నించిన హోటల్ సిబ్బందిని అడ్డుకుని.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో.. హోటల్ యజమాని బాధితులతో వాగ్వాదానికి దిగాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కస్టమర్లందరినీ బయటికి పంపించేసి.. హోటల్‌ని మూసేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ ఐటమ్స్ పరిశీలించి.. హోటల్‌కు జరిమానా కూడా విధించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు. చిన్న చిన్న పిల్లల కోసం చాలా మంది హోటల్ నుంచి టిఫిన్స్ తీసుకెళ్తుంటారని.. ఇలా జెర్రీలు, బల్లులు వస్తే.. పిల్లలకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి