HOME

టాప్ 10 న్యూస్ టుడే 04/10/2021

టాప్ 10 న్యూస్ టుడే 

  1. పంట దక్కక అప్పు తీర్చలేక ఇద్దరు రైతుల బలవన్మరణం..
  2. దళిత బందు విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం...
  3. పెట్రో మంట.. మరో సారి పెరిగిన పెట్రోల్ రేట్
  4. 8 న ఈటల రాజేందర్ నామినినేషన్.బీజేపీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన.
  5. కొత్త బైక్ కంటే 2 హెల్మెట్లు ఇవ్వాల్సిందే..
  6. తిరిగి తెలంగాణకి విక్రమ్ జిత్ దుగ్గల్...
  7. TSRTC ఉద్యోగులకు ఆర్టీసి బంపర్ ఆఫర్.. ఐదు ఏళ్ల వరకు సెలవలు....
  8. కఠినంగా జేఈఈ అడ్వాన్స్డ్ ......పేపర్ 1 తో పోల్చుకుంటే పేపర్ 2 కష్టం. రేపు సాయంత్రం వెబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రం
  9. టీటీడీ శ్రీ పద్మావతి ఆస్పత్రిలో సేవలందించడానికి దరఖాస్తులు ఆహ్వానించిన టీటీడీ.
  10. కరోనా 199 రోజుల కనిష్టానికి ఆక్టివ్ కేసులు.   

1)పంట దక్కక అప్పు తీర్చలేక ఇద్దరు రైతుల బలవన్మరణం..



TG: భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆదిలాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సొనాల గ్రామానికి చెందిన ఎకిలం శశిధర్‌(28) మూడెకరాల సొంత భూమితో పాటు, 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. 12 ఎకరాల్లో సోయా, మూడెకరాల్లో పత్తి వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట నీట మునగగా.. పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటులో మరో రూ.4 లక్షల అప్పులున్నాయి. పంటలు నష్టపోవడంతో రుణాలు ఎలా తీర్చాలనే మనోవేదనతకు గురైయ్యాడు. ఆదివారం బజార్‌హత్నూర్‌ మండలం కొలారి శివారులోని తన పంటపొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శశిధర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన గౌవేని రాజయ్య(45) 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేస్తున్నాడు. కొన్నేళ్లుగా పంట దిగుబడులు సరిగా రావడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ఏడాది పంటా దెబ్బతింది. మరోవైపు రూ.10 లక్షల అప్పు ఉండటంతో మనోవేదనకు గురైయ్యాడు. ఆదివారం పత్తి చేనుకు వెళ్లిన పురుగుల మందు తాగి తన సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే రాజయ్య భార్య, సోదరుడు చేను వద్దకు వెళ్లి.. అపస్మారక స్థితిలో ఉన్న రాజయ్యను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2)దళిత బందు విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం...



హైదరాబాద్‌: దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు విధివిధానాలు జారీ చేసింది. ఈమేరకు మార్గదర్శకాలు ప్రకటిస్తూ ఎస్సీ అభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక దళితబంధు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, సంబంధిత పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని తెలిపింది. ఆఖాతాలోకి రూ.9.90లక్షలు కలెక్టర్‌ బదిలీ చేయాలని పేర్కొంది.

రూ.10లక్షలతో నిధులతో సాధ్యమైతే రెండు విభిన్న యూనిట్లకు అనుమతి

లబ్ధిదారులను వారు ఆసక్తి కనబర్చే యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని.. వ్యవసాయం- అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ- పరిశ్రమల రంగం, రిటైల్‌ దుకాణాలు, సేవలు- సరఫరా రంగాలుగా విభజించాలని తెలిపింది. ఆయా రంగాల వారీగా రిసోర్స్‌ పర్సన్స్‌ను ఎంపిక చేయడంతో పాటు బృందాలను కలెక్టర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రూ.10లక్షలు యూనిట్‌ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రిసోర్స్‌ బృందాలు రూపొందించాలి. మొత్తం రూ.10లక్షలు విలువచేసేలా రెండు సబ్‌ యూనిట్లు కూడా ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి  ఎక్కువ మొత్తంతో పెద్ద యూనిట్‌కు కూడా అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

యూనిట్ల అవసరాల దృష్ట్యా లబ్ధిదారులకు శిక్షణ

రిసోర్స్ బృందాలతో కలెక్టర్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారికి వివిధ యూనిట్లపై అవగాహన కల్పించాలి. అవసరమైతే రిసోర్స్ బృందాలు ఎక్కువమార్లు కూడా లబ్దిదారుల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభవం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను యూనిట్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ల ఖరారు అనంతరం వారికి అందులో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల దృష్ట్యా రెండు నుంచి ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో లబ్దిదారులు ఎంచుకున్న యూనిట్ల పనితీరు పరిశీలన కోసం పర్యటనలు ఏర్పాటు చేయాలని, ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన  కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్ పై పూర్తి అవగాహన కలిగి, పూర్తి స్థాయిలో నడిపించేందుకు సిద్ధమైనట్లు కలెక్టర్, రీసోర్స్ బృందం సంతృప్తి చెందితే యూనిట్ ను వారికి అందించాలని తెలిపింది. మంజూరు అనంతరం కూడా యూనిట్ల నిర్వహణలో రిసోర్స్ బృందాలు లబ్దిదారులకు తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తి స్థాయిలో నడిచేలా ప్రతిదశలోనూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, బృందాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

3)పెట్రో మంట మరో సారీ పెరిగిన పెట్రోల్ రేట్..


























దిల్లీ: దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్‌ పెట్రోల్‌ పై 25పైసలు, డీజిల్‌ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్‌ ధరలు సెంచరీని క్రాస్‌ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు.  

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.26 ఉండగా.. డీజిల్ ధర రూ.98.72 ఉంది.  

విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది.  

వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. 

ఢిల్లీలో  పెట్రోల్‌ ధర రూ.102.39 ఉండగా.. డీజిల్‌ ధర రూ.108.43 ఉంది

కోల్‌ కతాలో పెట్రోల్‌ ధర రూ. 103 ఉండగా .. డీజిల్‌ ధర రూ.93.87 ఉంది

4)8 న ఈటల రాజేందర్ నామినినేషన్.బీజేపీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన.



























కరీంనగర్‌: అందరూ ఊహించినట్లుగానే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ ఖరారయ్యారు. పార్టీ రాష్ట్ర కమిటీ పంపిన ప్రతిపాదనల మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8న నామినేషన్‌ వేసేందుకు ఈటల ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఎసైన్డ్‌ భూముల విషయమై ఆరోపణలను ఎదుర్కొన్న రాజేందర్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి మే 2న బర్తరఫ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆయన హుజూరాబాద్‌, కమలాపూర్‌ నియోజకవర్గాల నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జూన్‌ 14న దిల్లీలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

5)కొత్త బైక్ కంటే 2 హెల్మెట్లు ఇవ్వాల్సిందే




హైదరాబాద్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బహుదూర్‌పల్లికి చెందిన లక్ష్మి తన భర్తతో కలిసి కొద్దిరోజుల క్రితం మియాపూర్‌లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. బాచుపల్లి వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే అసువులు బాశారు. శిరస్త్రాణం ఉండటంతో భర్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు మృతి చెందుతుండగా.. శిరస్త్రాణం లేకపోవడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 21,999 ప్రమాదాలు జరగగా.. 6,964 మంది చనిపోయారు. వీరిలో 2,863 మంది ద్విచక్ర వాహనదారులే. మృతుల్లో 1,996 మంది డ్రైవర్లు, 867 మంది పిలియన్‌ రైడర్లు ఉన్నారు. వాహనం నడిపేవారితో పాటు పిలియన్‌ రైడర్‌ (వెనక కూర్చున్న వ్యక్తి) శిరస్త్రాణం ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. వాహనాలు విక్రయించే డీలర్లే రెండు శిరస్త్రాణాలను ఉచితంగా ఇవ్వాలని నిబంధనలున్నాయి. వాటిని చాలామంది బేఖాతరు చేస్తుండటమే అసలు సమస్య.

ఇదీ నిబంధన 

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989లోని 138(4)(ఎఫ్‌) ప్రకారం.. ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకం సమయంలో కొనుగోలుదారుకు తయారీదారుల నుంచి తెప్పించి డీలర్లు తప్పనిసరిగా రెండు శిరస్త్రాణాల్ని ఉచితంగా అందించాలి. అవి కచ్చితంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాహనం తయారీ సమయంలో పాటించే వివిధ భద్రత ప్రమాణాల్లో శిరస్త్రాణాన్నీ పరిగణించాలి.

ఉచిత శిరస్త్రాణాలు పొందడం తమ హక్కు అని.. చాలామంది వాహనదారులకు అవగాహన లేదు. కొందరు డీలర్లను అడిగితే తయారీదారులు సరఫరా చేయడం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఒకరిద్దరు డీలర్లు తప్ప ఎక్కడా ఉచితంగా అందిస్తున్న దాఖలాలు లేవు.

ఇలా చేయాలి..

* రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీవో కార్యాలయాల్లో వాహనం ఇన్‌వాయిస్‌తోపాటు ఉచిత శిరస్త్రాణాలు పొందినట్లు చూపించే ధ్రువీకరణపత్రం జత చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వాహన డీలర్లు రెండు శిరస్త్రాణాల్ని ఉచితంగా తమకు ఇచ్చినట్లు కొనుగోలుదారు ధ్రువీకరణ ఇవ్వకపోతే వాహనం రిజిస్ట్రేషన్‌ ఆపేయాలి. అలాంటి సందర్భాల్లో డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

* షోరూంలలో ‘ఉచిత నిబంధన’ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలి.

* తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 9,06,705 వాహనాలు విక్రయించగా.. వాటిలో 6,45,954 (71.2 శాతం) ద్విచక్ర వాహనాలే.

* ద్విచక్ర వాహనదారుల ప్రమాద మరణాల్లో దేశంలో తెలంగాణ అయిదో స్థానంలో ఉంది.

* రాష్ట్రంలో ట్రాఫిక్‌ పోలీసులు విధిస్తున్న జరిమానాల్లో 70 శాతానికిపైగా శిరస్త్రాణం ధరించని కేసులే ఉంటున్నాయి. 2019లో 72,74,713 (73.3 శాతం), 2020లో అక్టోబరు నాటికి 89,13,892 (78.13 శాతం) కేసులు నమోదయ్యాయి.

6)తిరిగి తెలంగాణకి విక్రమ్ జిత్ దుగ్గల్... 



 తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి విక్రమ్‌జీత్‌ దుగ్గల్‌ను ఆకస్మికంగా రిలీవ్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే తిరిగి వెళ్లాలని ఆదేశిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి సమాచారం అందించింది. రామగుండం కమిషనర్‌గా పనిచేస్తూ.. ఇంటర్‌స్టేట్‌ డిప్యుటేషన్‌పై 2019 ఏప్రిల్‌లో ఆయన సొంత రాష్ట్రం పంజాబ్‌కు వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎంగా పనిచేసిన అమరీందర్‌సింగ్‌ అప్పట్లో దుగ్గల్‌ను సొంత రాష్ట్రానికి పిలిపించుకున్నారు. అమృత్‌సర్‌ కమిషనర్‌గా ఉంటూ రిలీవ్‌ అయ్యారు. ఇటీవలే అమరీందర్‌ ప్రభుత్వం మారిన నేపథ్యంలోనే కొత్త సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

7)TSRTC ఉద్యోగులకు ఆర్టీసి బంపర్ ఆఫర్.. ఐదు ఏళ్ల వరకు సెలవలు....


ఐదేళ్ల వరకు సెలవులు

అయినా మీ ఉద్యోగం భద్రం

డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

3 వేల మిగులు సిబ్బంది నేపథ్యంలో నిర్ణయం

‘అసాధారణ సెలవు’ను పునరుద్ధరించిన సంస్థ 


హైదరాబాద్‌: మస్తాన్, శేఖర్‌కే కాదు.. వీరిలా సుదీర్ఘ సెలవు పెట్టాలనుకునే డ్రైవర్, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వీరికి ‘అసాధారణ సెలవు’విధానం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా.. అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌ (ఈఓఎల్‌)’కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

గుర్తొచ్చిందే తడవు అమల్లోకి..

రెండేళ్ల క్రితం కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను అదనంగా తీసుకుంది. వాటిల్లో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసినందున అంతమేర సంస్థ డ్రైవర్లు మిగిలిపోయారు. ఆ వెంటనే వేయి బస్సులను ఆర్టీసీ తగ్గించుకోవటంతో మళ్లీ డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇలా ప్రస్తుతం దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయి ఉన్నారు.

వీరికి పని లేకపోయినా జీతం చెల్లించాల్సిందే. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగుల నేపథ్యంలో ఆర్టీసీకి ఈ అసాధారణ సెలవు గుర్తొచ్చింది. ఇలా సిబ్బంది మిగిలిపోతే ఈ సెలవు ఇవ్వచ్చని ఆర్టీసీ విధివిధానాల్లో ఉంది. గతంలో అమలు చేశారు కూడా. తర్వాత డ్రైవర్, కండక్టర్ల కొరత దృష్ట్యా దీన్ని నిలిపేశారు.   

గరిష్టంగా ఐదేళ్లే..: ఈఓఎల్‌ కింద గరిష్టంగా ఐదేళ్లపాటు సెలవులో ఉండొచ్చు. అప్పటివరకు వారి ఉద్యోగం అలాగే పదిలంగా ఉంటుంది. మిగిలి ఉన్న సెలవులను వినియోగించుకున్నంత మేర వారికి జీతం వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి జీతం ఉండదు. అయితే జీతం రాకపోయినా పరవాలేదు సెలవు దొరి కితేచాలు అనుకునే.. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవా రికి, విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నవారికి, రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్న వారికి ఇది ఉపకరిస్తుంది. 

ఇబ్బందిగా మారిన రెండేళ్ల పొడిగింపు

గత సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని రెండేళ్లు పొడిగించారు. దీంతో 58 ఏళ్లకు బదులు 60 ఏళ్ల వయస్సు వరకు ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఏర్పడింది. ఇది డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. వీరిలో చాలామంది 58 ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ విధులు నిర్వర్తించడానికే ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యపరంగా ఏర్పడే సమస్యలే దీనికి ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో సర్వీసు మరో రెండేళ్లు పొడిగించటంతో చాలామంది నిస్సహాయ స్ధితిలో ఉన్నారు. తాజాగా ఇలాంటివారు కూడా ఈ అసాధారణ సెలవును వినియోగించుకునేందుకు, ఇతర ఆదాయ మార్గాలు చూసుకునేందుకు అవకాశం ఏర్పడింది.  

►మస్తాన్‌ ఆర్టీసీలో కండక్టర్‌.. కుటుంబ అవసరాలకు ఆదాయం సరిపోక పోవడంతో దుబాయ్‌ వెళ్లి పెద్దమొత్తంలో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. నాలుగైదేళ్ల పాటు అక్కడే ఉండాలనే ఉద్దేశంతో అప్పటివరకు ఆర్టీసీ విధులకు రాలేనంటూ సెలవు ఆర్జీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంత సుదీర్ఘ సెలవు పెడితే ఉద్యోగం ఉంటుందా? అనే సందిగ్ధంలో ఉన్నాడు. 

►శేఖర్‌ హైదరాబాద్‌లో బస్సు డ్రైవర్‌.. మరో నాలుగేళ్లలో రిటైర్మెంట్‌ ఉంది. కానీ ఇటీవల ఒంట్లో నిస్సత్తువగా ఉంటూ నగరంలో డ్రైవింగ్‌ చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు. విధులకు వెళ్లొద్దని కుటుంబసభ్యులు సూచిస్తుండటంతో సుదీర్ఘ సెలవు పెట్టేసి ఇతర ఆదాయ మార్గాలు చూసుకోవాలనుకుంటున్నాడు. కానీ సంస్థ అనుమతిస్తుందో, లేదోనన్న అనుమానంతో ఉన్నాడు.

ఫిర్యాదులు నాకు చెప్పండి: సజ్జనార్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న సజ్జనార్‌.. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. md@tsrtc.telangana.gov.in మెయిల్‌ ఐడీని వెల్లడించారు. @tsrtcmdoffice ట్విట్టర్‌ ఖాతాను కూడా అనుసరించాల్సిందిగా కోరారు.

8)కఠినంగా జేఈఈ అడ్వాన్స్డ్ ......పేపర్ 1 తో పోల్చుకుంటే పేపర్ 2 కష్టం. రేపు సాయంత్రం వెబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రం




ఈనాడు- హైదరాబాద్‌, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది పరీక్షతో పోల్చుకున్నా కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి ఉదయం జరిగిన పేపర్‌-1 కంటే మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 ప్రశ్నపత్రం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అధిక శాతం మంది విద్యార్థులు గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని, రసాయనశాస్త్రం ప్రశ్నలు క్లిష్టంగాను, భౌతికశాస్త్రం మధ్యస్తంగానూ ఉన్నాయని శ్రీచైతన్య జేఈఈ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ చెప్పారు. మొత్తంమీద సగటు విద్యార్థికి ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రసాయనశాస్త్రం మార్కులు ఈసారి ఉత్తమ ర్యాంకును నిర్ణయిస్తాయన్నారు. సగటున 18 శాతం మార్కులు అంటే.. 360కి 65 వస్తే జనరల్‌ కేటగిరీ విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారని అంచనా వేశారు. పేపర్‌-1, 2లో గణితం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని విజయవాడకు చెందిన శారదా విద్యాసంస్థల నిపుణుడు విఘ్నేశ్వరరావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేల మంది పరీక్ష రాశారు. కొందరు విద్యార్థులు 310కి పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

9)టీటీడీ శ్రీ పద్మావతి ఆస్పత్రిలో సేవలందించడానికి దరఖాస్తులు ఆహ్వానించిన టీటీడీ.


తిరుపతిలోని శ్రీపద్మావతి పిల్లల హృదయాలయం(శ్రీపద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌) ఆసుపత్రిలో స్వచ్ఛందంగా సేవలందించడానికి దేశంలో గుర్తింపు పొందిన వైద్య నిపుణుల నుంచి తితిదే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాణదానం పథకం కింద నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు, వైద్యసేవలు అందించడానికి పదిహేను ఏళ్ల అనుభవం కలిగి, హిందూ మతానికి చెందిన పీడియాట్రిక్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్లు అర్హులని తెలిపింది. ఈ సేవలు రెండు విధానాల్లో ఉంటాయని పేర్కొంది. ఆప్షన్‌-ఎ కింద సేవకు వచ్చే వైద్యుడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీవారి ప్రొటోకాల్‌ దర్శనం, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించనుంది. ఆప్షన్‌-బి కింద తితిదే నియమ నిబంధనల మేరకు వైద్య నిపుణులకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తుంది. రెండో ఆప్షన్‌ ఎంచుకున్న వారికి వసతి, దర్శనం, స్థానిక రవాణా సదుపాయాలు ఉండవు. ఆసక్తి ఉన్న వైద్యులు cmo.adldirector@gmail.com మెయిల్‌ ఐడీకి వివరాలు పంపాలని కోరింది.

10)కరోనా 199 రోజుల కనిష్టానికి ఆక్టివ్ కేసులు.   




దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య ఆదివారం మరింత తగ్గి 199 రోజుల కనిష్ఠానికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 22,842 మంది వైరస్‌బారిన పడగా.. 25,930 మంది కోలుకున్నారు. 244 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. మొత్తంగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య  3,38,13,903కి చేరగా.. వీరిలో 3,30,94,529 మంది కోలుకున్నారు. 4,48,817 మంది మహమ్మారికి బలైపోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా 90.51 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి