HOME

మొదటి ర్యాంక్‌ వచ్చినా ఉద్యోగం లేదు.. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం (TG DSC SELACTION LIST)

 మొదటి ర్యాంక్‌ వచ్చినా ఉద్యోగం లేదు.. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం


ఓ వైపు టీచర్ల నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్‌ ఉన్నా ఉద్యోగాలు రాలేదని డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


మొదటి ర్యాంకు సాధించినా అర్హులుకారని వెనక్కి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బోళ్ల రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి నాన్‌ లోకల్‌ కింద ఎస్‌.ఏ సోషల్‌ తెలుగు మీడియంలో మొదటి ర్యాంకు సాధించాడు.

అన్‌ రిజర్వ్‌డ్‌ పోస్టులో అతడికి కేటాయించాల్సిన ఉద్యోగాన్ని మరొకరికి కేటాయించారని హైదరాబాద్‌ విద్యాశాఖ అధికారి రోహిణికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా చాలా మంది తమకు అన్యాయం జరిగిందని డీఈవోకు దరఖాస్తుల రూపంలో మొరపెట్టుకున్నారు.

ఇన్‌సర్వీస్‌ తిప్పలు

హైదరాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు 616 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి బుధవారం ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారు. హైదరాబాద్‌లో 878 పోస్టులకుగాను 262 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉంది.

ఉర్దూ మీడియం రిజర్వేషన్‌ కేటగిరిలో అభ్యర్థులు లేకపోవడంతో పోస్టులు పెండింగ్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇన్‌సర్వీస్‌లో ఉండి సెలవులు పెట్టకుండానే బీఈడీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 8మంది అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడినట్టు తెలిసింది. దీంతో సదరు అభ్యర్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.


పరీక్షల విభాగం ముందుగానే తమను నిరాకరించాల్సిందని.. పరీక్షకు అనుమతించి ర్యాంకు వచ్చాక ఇప్పుడు ఇన్‌సర్వీస్‌ అని ఇబ్బందులు సృష్టించడం సరైనది కాదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి