టాప్ న్యూస్ టుడే TOP 10 NEWS

 1)ఎం తమాషా చేస్తున్నారా'



అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సభాపతి పోచారం


బీర్కూర్‌: దేవుడి కార్యం పనుల్లో ఇంత నిర్లక్షమా ఏం తమాషా చేస్తున్నారా అని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


మండల కేంద్రం శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం అభివృద్ధి పనులపై శుక్రవారం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.


పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులు లేకపోవడంపై మండిపడ్డారు. ఫిబ్రవరిలోపు కల్యాణ మండపం, భక్తుల అతిథిగృహాలను ప్రారంభించేలా సిద్ధం చేయాలన్నారు.


మార్చిలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ రాజేశ్వర్‌రెడ్డి, డీఈ మోహన్‌రెడ్డి, ఏఈ భానుచందర్‌, పీఆర్‌ ఏఈ జుబేర్‌, కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు, నర్సరాజు ఉన్నారు.


2)హైదరాబాద్ పోలీస్ కమిషనర్  గా సీవీ ఆనంద్



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి పోలీసు కమిషనర్ గా సీవీ ఆనంద్ ను నియమించింది.


అలాగే ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న అంజనీ కుమార్ ను ఏసీబీ జనరల్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. అలాగే వెస్ట్ జోన్ డీసీపీ గా జోయల్ డేవిడ్ ను నియమించింది. జోయల్ డేవిడ్ ఇప్పటి వరకు సిద్ధిపేట్ కమిషనర్ గా విధులు నిర్వహించాడు. వీటితో రాష్ట్రంలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఇప్పటి వరకు అడిషనల్ సీపీ క్రమ్స్ గా ఉన్న శిఖా గోయల్ ను ఏసీబీ డైరెక్టర్ గా బదిలీ చేశారు.


మొత్తంగా 30 ఐపీఎస్ లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అంతే కాకుండా దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగ హైదరాబాద్ సీపీ గా వస్తున్న సీవీ ఆనంద్ ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉన్నాడు.అయితే దానికి ముందు కేంద్ర సర్వీస్ లలో ఉన్నాడు.


అయితే ఇటీవల ఆయనను తెలంగాణ రాష్ట్ర క్యాడర్ కు పిలిపించారు. తనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర క్యాడర్ కు తీసుకువచ్చారని తెలుస్తుంది. అయితే సీవీ ఆనంద్ గతంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ డిపాట్మెంట్ కు చీఫ్ గా పని చేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన హైదరాబాద్ పై పూర్తి గ్రిప్ ఉంది.


3)ఎర్రచందనం దుంగలు పట్టివేత



కడప నుంచి బెంగళూరుకు తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌


చిలమత్తూరు: అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం రాత్రి చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారు.


కడప జిల్లా నుంచి బెంగళూరుకు లారీలో (యూపీ-63.టీ-3300) తరలిస్తుండగా జాతీయ రహదారి 44 కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం రూరల్‌ సీఐ హమీద్‌ఖాన, ఎస్‌.ఐ రంగడు యాదవ్‌ వాటిని స్వాధీనం చేసుకున్నారు. లారీ ముందు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంలో వెళుతుండగా వారిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వారు ద్విచక్ర వాహనాన్ని అక్కడే పడేసి పారిపోయారు. వెనుక వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా..


అందులో 38 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. లారీతో పాటు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి తప్పించుకున్నాడు. ఎర్రచందనం దుంగలతో పాటు లారీని, ద్విచక్రవాహనాన్ని చిలమత్తూరు స్టేషన తరలించినట్లు ఎస్‌ఐ రంగడు తెలిపారు.

అయితే ఈ దుంగలను ఎవరు రవాణా చేస్తున్నారు? ఎక్కడికి తీసుకెళుతున్నారు? వాటి విలువ ఎంత? అనే విషయాలను పోలీసులు వెల్లడించడానికి నిరాకరించారు.


కాగా, ఈ దుంగల విలువ రూ. 15 లక్షలు ఉండవచ్చని భావిస్తున్నారు. నెల క్రితం పలువురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే.


4)ప్రేమతో అందరి మనసులు గెలుద్దాం



ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సీతక్క. చిత్రంలో తహసీల్దార్‌, ఎంపీవో తదితరులు


మంగపేట: ఏసు క్రీస్తు చెప్పిన విధంగా అందరి పట్ల దయ, ప్రేమానురాగాలతో నడుచుకొని వారి మనసులు గెలుద్దామని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.


శుక్రవారం మండలకేంద్రంలోని గంపోనిగూడెం రైతు వేదిక భవనంలో ప్రభుత్వం తరఫున క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఆమె హాజరై మాట్లాడారు. మంచి సమాజం, కుటుంబం నిర్మాణానికి ప్రతి ఒక్కరు ఇతరుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ఆచరిస్తారని కొనియాడారు. అనంతరం కేకు కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. క్రైస్తవులకు కానుకలు సీతక్క పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా పాస్టర్లు ఎమ్మెల్యే, తహసీల్దార్‌ బాబ్జీప్రసాద్‌, ఎంపీవో శ్రీకాంత్‌, సహకార సంఘం చైర్మన్‌ తోట రమేశ్‌, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డిని శాలువాలతో సన్మానించారు. పాస్టర్ల సంఘం మండల అధ్యక్షులు ఆదాం, సెక్రటరి దేవరాజ్‌, జాయింట్‌ సెక్రటరి తిమోతి, కోశాధికారి విజయరాజు, పాస్టర్లు ఆంధ్రయ్య, పీటర్‌, కృపానిధి తదితరులు పాల్గొన్నారు.


కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


మంగపేట మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే సీతక్క కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు అందించారు. ఆర్‌ఐ కామేశ్వర్‌రావు, వీఆర్వోలు పాల్గొన్నారు.


5) ఆ ఎస్సై మంచి పని చేశాడు: మంత్రి హరీష్ రావు ట్వీట్



హైదరాబాద్:కరోనా వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు వద్దు అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు.


అప్పుడే కరోనాను శాశ్వతంగా కట్టడి చేయం సాధ్యమవుతుందని ట్వీట్ చేశారు.


కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు తొలగించి, వ్యాక్సిన్ వేయించిన ఆసిఫాబాద్ జిల్లా దహెగాం ఎస్ఐ రఘుపతిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.


6) పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ రాహుల్‌ హెగ్డే



సిరిసిల్ల:పెండింగ్‌ కేసుల పరిష్కారానికి బాధ్యతగా కృషిచేయాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.


జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నేరాల నియంత్రణపై నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కొత్తకేసులతోపాటు పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కేసుల సంఖ్య తగ్గించే దిశగా పనిచేయాలని అన్నారు. జిల్లాలో పెండింగ్‌ కేసుల పరిష్కారంలో మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఇందుకోసం కోర్టుల్లో న్యాయమూర్తులతో చర్చించాలని, కేసుల పురోగతి, విచారణ విషయాల్లో అధికారులంతా చురుకుగా పనిచేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్‌ కేసులను వెంటనే ఛేదించాలన్నారు. ఫంక్షన్‌ వర్టికల్‌ వారిగా విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరుచూ శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. యువతపై చెడు ప్రభావం చూపుతున్న గంజాయి, గుట్కా, గ్యాంబ్లీంగ్‌పై నిఘా ఉంచాలని, వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించిన దరఖాస్తులపై వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్లపై బారీ కేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్రంకెన్‌ డైవ్‌, వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగేవారిపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు చంద్రశేఖర్‌, రవికుమార్‌, సీఐలు అనిల్‌కుమార్‌, ఉపేందర్‌, మొగిలి, వెంకటేశ్‌, శ్రీలత, ఎస్‌బీఐ సర్వర్‌, డీసీఆర్‌బీ సీఐ నవీన్‌కుమార్‌, ఆర్‌ఐలు కుమారస్వామి, రజనీకాంత్‌, యాదగిరి, ఎస్సై, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.


7)మానవత్వాన్ని చాటుకున్న కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు



ఒకసారిగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోతున్న ఓ నిండు ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు.


అయితే హైదరాబాద్ చాదర్ ఘాట్ సిగ్నల్ వద్ద టూ వీలర్ పై ఓ వ్యక్తికి హార్టెటాక్ వచ్చింది.


దాంతో ఒకసారిగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోతున్న వ్యక్తిని గమనించిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు. ఆయా వ్యక్తిని సమీప హాస్పిటల్ తరలించారు.


వెంటనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికీ సమాచారం అందించారు పోలీసులు.


అయితే సకాలంలో స్పందించి ఒక నిండు ప్రాణం కాపాడిన కాచిగూడ ట్రాఫిక్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు ఆ కుటుంబ సభ్యులు.


8)తెలంగాణ రైతులను కేంద్రం అవమానపరుస్తుంది: ఎంపీ నామా



తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ........


కేంద్రంపై నిప్పులు చెరిగారు.

తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రంస్పష్టత ఇవ్వాలన్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారు.


'ఆహార భద్రత చట్టం' కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని అన్నారు.

భారత్ లో తెలంగాణ లేదా? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా? అంటూ ఆయన ప్రశ్నించారు.


ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తొమ్మిది రోజులు పార్లమెంట్‌లో ఆందోళన చేసినప్పట్టికీ పట్టించుకోలేదన్నారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామన్నారు.


బీజేపీ ఎంపీలు రైతుల గురించి ఒక్క మాట మాట్లడలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దని, రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

9)హన్మకొండ బస్ స్టాండులో వ్యభిచార దందా



హన్మకొండ: హన్మకొండ కొత్తబస్టాండ్ చుట్టుపక్క ఉన్న లాడ్జీల్లో విచ్చల విడిగా వ్యభిచారం జరుగుతోంది. ఎవ్వరు పటిచుకోక పోవడంతో లాడ్జ్ నిర్వాహకులు ఆడిందే ఆటగా దందా సాగుతోంది.


ప్రతిరోజు ఉదయం నుండి అర్ధ రాత్రి వరకూ ఇదే తంతు నడుస్తోందని పలువురు ప్రయాణీకులు అంటున్నారు.


సూదురా ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు మాయ మాటలు చెప్పి లార్జిలకు తీసుకుని వెళతారు. అందిన కాడికి బెదిరించి లాక్కుంటారు.


గతంలో కొన్ని సందర్భాలలో ఇలాంటి విషయాలలో గొడవలు జరిగినా పోలీసులు పట్టించుకో లేదు.


ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


10)బార్లు, పబ్బుల యజమానులకు పోలీస్ కమిషనర్ వార్నింగ్



నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బార్లు, పబ్‌ ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.


మైనర్లకు లిక్కర్ అమ్మిన బార్లు, పబ్ లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనల మేరకు కొన్ని చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరంలోని అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని చెప్పారు.


మద్యం సేవించి వాహనాల నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా పిల్లల విషయంలో తల్లితండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.


కోవిడ్ నిబంధనలుపాటిస్తూ ప్రతి ఒక్కరూ ప్రశాంతవాతావరణలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అంజనీ కుమార్ ఆదేశించారు.